KTR: కవిత అరెస్ట్ రోజే రంజిత్‌రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు: కేటీఆర్

BRS Leader KTR Fires On Congress Leader Ranjith Reddy
  • బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించేంత వరకు రంజిత్‌రెడ్డి ఎవరో ప్రపంచానికి తెలియదన్న కేటీఆర్
  • రాజకీయాలకు కొత్త అయినా పార్టీ కార్యకర్తలు గెలిపించారన్న బీఆర్ఎస్ అగ్రనేత
  • పార్టీ కంటే తానే గొప్ప అనుకుంటే మాజీ ఎంపీ విశ్వేశ్వరెడ్డి పరిస్థితిలా అవుతుందని హెచ్చరిక
చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ నేత రంజిత్‌రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి తిరిగి అదే స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో నేడు సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ..  బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించేంత వరకు రంజిత్‌రెడ్డి ఎవరో ఈ ప్రపంచానికి తెలియదని అన్నారు. రాజకీయాలకు కొత్త అయినా పార్టీ కార్యకర్తలు ఆయనను కష్టపడి గెలిపించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఆయన అధికారం కోసం, ఆస్తుల కోసం పార్టీకి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. 

పార్టీకి ద్రోహం చేసిన స్వార్థపరుడు
కవిత తన సోదరి అని చెప్పుకునే రంజిత్‌రెడ్డి.. ఈడీ ఆమెను అరెస్ట్ చేసిన రోజే నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారని, ఆయనో స్వార్ధపరుడని దుమ్మెత్తిపోశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని పార్టీని వీడి వెళ్లాడని ప్రజలంతా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే తానే ఎక్కువని భావించి బయటకు వెళ్లిన మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసన్నారు. పార్టీ కంటే తానే ఎక్కువని భావించే వారు రాజకీయాల్లో గెలవలేరని పేర్కొన్నారు. అదే నిజమైతే దేశంలో పార్టీలే ఉండవని, స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని తెలిపారు. 

అభ్యర్థులే లేని కాంగ్రెస్ గెలవడం అసాధ్యం
రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సొంతంగా అభ్యర్థులు లేని కాంగ్రెస్ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని జోస్యం చెప్పారు. చేవెళ్లలో ఏప్రిల్ 13న కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
 
కాసాని గెలుపు ఈజీ
సామాజిక సమీకరణాల రీత్యా బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సులభంగా గెలుస్తారని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. కాసాని కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్‌లు, బీసీలకు అండగా ఉంటున్నారని తెలిపారు.  ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోతున్న మంచి మనిషి, నాయకుడు అని కాసానిని ప్రశంసించారు.
KTR
BRS
Ranjith Reddy
Congress
Chevella
Kasani Gnaneshwar Mudiraj

More Telugu News