Donald Trump: ప్రపంచ సంపన్నుల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Donald Trumps Net Worth Hits over 6 Billion Dollars and he entered in World top 500 people
  • 6.5 బిలియన్ డాలర్లకు చేరిన ట్రంప్ నికర సంపద విలువ
  • బ్లూమ్‌బర్గ్ టాప్-500 సంపన్నుల జాబితాలో అడుగుపెట్టిన మాజీ అధ్యక్షుడు
  • ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు’ విలీన ప్రక్రియ ముగియడంతో అమాంతం పెరిగిన సంపద
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంపన్నులలో ఒకరిగా అవతరించారు. 6.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ టాప్-500లో చోటు దక్కించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన సోషల్ మీడియా కంపెనీ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’నకు సంబంధించిన విలీన ప్రక్రియ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సోమవారం పూర్తయ్యింది. దీంతో బిలియన్ డాలర్ల విలువైన షేర్లు అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ వశమయ్యాయి. దీంతో అప్పటివరకు 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ నికర విలువ 6.5 బిలియన్ డాలర్లకు చేరింది.

‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు (డీడబ్ల్యూఏసీ) కంపెనీలో ట్రంప్ వాటా 58 శాతంగా ఉంది. దీని విలువ 3.9 బిలియన్ డాలర్లు. ఇక సోమవారం డీడబ్ల్యూఏసీ షేర్లు 49.95 డాలర్ల వద్ద ముగిశాయి. ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆ కంపెనీ షేర్లు 185 శాతం వృద్ధి చెందాయి. కాగా ట్రంప్ సోషల్ మీడియా విలీన ప్రక్రియ పూర్తయిన విషయాన్ని ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కాగా 77 ఏళ్ల వయసున్న ట్రంప్ సంపదలో అధిక భాగం రియల్ ఎస్టేట్ ఆస్తుల రూపంలో ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆయన బాగా సంపాదించారు.

నిజానికి డొనాల్డ్ ట్రంప్ సంపదకు సోమవారం పెనుముప్పు ఎదురైంది. న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ కేసులో 500 మిలియన్ డాలర్లకుపైగా బాండ్ పేమెంట్‌ను సోమవారం చెల్లించాల్సి ఉన్న సమయంలో అప్పీల్ కోర్టు ఆయనకు ఉపశమనాన్ని కల్పించింది. అంత డబ్బు చెల్లించలేనంటూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పేమెంట్ మొత్తాన్ని 175 మిలియన్ డాలర్లకు తగ్గించింది. ఈ మొత్తం చెల్లింపునకు 10 రోజుల గడువు కూడా ఇచ్చింది. మరో కేసు విచారణ నిమిత్తం డొనాల్డ్ ట్రంప్ వేరే కోర్టులో ఉన్న సమయంలో అతడికి ఈ గుడ్‌న్యూస్ వచ్చింది. దీంతో 175 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించగలనంటూ ఆయన కోర్టుకు సమాచారం పంపించారు.
Donald Trump
World Richest pople
USA
Bloomberg Billionaires Index

More Telugu News