Vijayasai Reddy: చంద్రబాబు ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు: విజయసాయిరెడ్డి

Vijayasaireddy describes Chandrababu is a manipulator
  • చంద్రబాబు మానిప్యులేషన్ల గురించి అందరికీ తెలుసన్న విజయసాయి
  • సీటు కావాలంటే వంద కోట్లు చెల్లించాలని ఆరోపణ
  • స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడని వ్యాఖ్యలు 
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే ప్రథమం. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తే. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో, తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులపై దృష్టి సారించారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. 

"చంద్రబాబు మానిప్యులేషన్స్ గురించి తెలియనిది ఎవరికి? సీటు కావాలంటే వంద కోట్లు చెల్లించాలి. ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు. అది ఏడు కోట్లా, ఇరవై కోట్లా అనేది స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు. బుకాయింపులు వద్దు. చంద్రబాబు హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబుతారు వొంటేరూ" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. 

అంతకుముందు, విజయసాయి మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు లోక్ సభ స్థానంలో టీడీపీకి అభ్యర్థి దొరక్క తమ పార్టీ నుంచి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు బరి నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
Vijayasai Reddy
Chandrababu
Vonteru Venugopala Reddy
YSRCP
TDP

More Telugu News