Pawan Kalyan: సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts on handloom worker family suicide incident
  • ఉమ్మడి కడప జిల్లాలో భార్యాబిడ్డలతో సహా చేనేత కార్మికుడి బలవన్మరణం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన 
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మాధవరం గ్రామంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు, భార్య, కుమార్తెతో సహా తనువు చాలించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల భూ దందాలకు పేదపీ బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వైసీపీ నేతల పేరు మీదకు ఎలా మారిపోయింది? ఆ కుటుంబ సామూహిక మరణాలకు కారకులు ఎవరో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని జనసేనాని మండిపడ్డారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం దస్తావేజులు కూడా ఇవ్వకుండా కేవలం ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా వైసీపీ భూ దందా కుట్రలో భాగమే అనిపిస్తోందని వెల్లడించారు. 

అధికార పదవుల్లోని ముఖ్య నేతలు భారీగా దోచేస్తుంటే, స్థానికంగా ఉన్న నాయకులు పేదల భూములు గుంజేస్తున్నారని పవన్ విమర్శించారు. వీటిని చట్టపరంగా చేసేందుకే చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకువచ్చారని ఆరోపించారు. 

రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు భూ దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Pawan Kalyan
Subbarao
Handloom Worker
Suicide
Kadapa District
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News