Vundavalli Sridevi: రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటివారో ఈ రోజు అర్థమైంది: ఉండవల్లి శ్రీదేవి

Vundavalli Sridevi cryptic tweet rages discussion
  • నేడు మూడో జాబితా ప్రకటించిన చంద్రబాబు
  • బాపట్ల ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్
  • తీవ్ర మనస్తాపంతో ట్వీట్ చేసిన ఉండవల్లి శ్రీదేవి

ఇవాళ టీడీపీ మూడో జాబితా ప్రకటించిన అనంతరం, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అని శ్రీదేవి పేర్కొన్నారు. అంతేకాదు, బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఈ పోస్టులో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆమె చేసిన ట్వీట్ ప్రధాన ప్రతిపక్షం గురించే అని అర్థమవుతోంది. 

ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున శాసనసభ్యురాలిగా గెలిచారు. అయితే, వైసీపీలో ఇతర నేతలతో సఖ్యత చెడడంతో ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా... ఈసారి ఎన్నికల్లో తిరువూరు (ఎస్సీ రిజర్వ్ డ్) అసెంబ్లీ స్థానం కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు. 

కానీ, ఇవాళ టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో బాపట్ల ఎంపీ స్థానానికి తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్ ను తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారు. ఈ పరిణామంతో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. 

అటు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News