palla rajeswar reddy: బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారిని వదిలిపెట్టేది లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeswar Reddy fires at leaders who going other parties
  • పార్టీ మారాలనుకునే వారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్
  • పార్టీ మారిన నేతలను ప్రజలు చెప్పులతో కొట్టడం ఖాయమని హెచ్చరిక
  • కాంగ్రెస్, బీజేపీలకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరవయ్యారని ఎద్దేవా
బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆ పార్టీ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన నేతలను ప్రజలు చెప్పులతో కొట్టడం హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీలకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరవయ్యారని ఎద్దేవా చేశారు.

అందుకే తమ పార్టీ నుంచి నేతలను చేర్చుకొని టిక్కెట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పిరికిపందలు మాత్రమే పార్టీ మారుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత లాభం కోసం ఓ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీలోకి వెళ్లడం దారుణమన్నారు. అక్రమాలు చేసిన వారు భయంతో పార్టీ మారుతున్నారని... అలాంటి వారి అవినీతి బాగోతాన్ని బీఆర్ఎస్సే బయటపెడుతుందని హెచ్చరించారు.

మేం ఖాళీ ఖజానా ఇవ్వలేదు

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు విడతలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును విడుదల చేసిందని తెలిపారు. తాము రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ.75 వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఎనిమిదో విడత రైతుబంధుకు సంబంధించి రూ.7,500 కోట్లు కూడా తాము అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడకు వెళ్లాయి? ఆ డబ్బులు ఎవరి తీసుకున్నారు? ఏ కాంట్రాక్టర్‌కు ఇచ్చారు? అనే వివరాలు అందరికీ తెలుసునన్నారు. తాము ఖాళీ ఖజానా ఇచ్చామని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని... కానీ రైతుబంధు కోసం రూ.7500 కోట్లు బ్యాంకులో వేస్తే... అప్పుడు అడ్డుకొని... అధికారంలోకి వచ్చాక వాడుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. అందుకే రైతుబంధు ఇవ్వడం లేదని ఆరోపించారు.

గత వంద రోజుల్లో రూ.16,500 కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. మొత్తం రూ.24,000 కోట్లు ఎక్కడకు వెళ్లాయో చెప్పాలన్నారు. రైతుబంధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ, వరికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
palla rajeswar reddy
Telangana
BRS
Congress
BJP

More Telugu News