Manda Krishna Madiga: సీఎం సీటుకు ఎసరు పెడతారని మాలలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: మందకృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు

Manda Krishna Madiga hot comments on CM Revanth Reddy
  • సీఎం సీటును కాపాడుకోవడం కోసం మాలలతో కుమ్మక్కై... మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం
  • కాంగ్రెస్‌లో నాగర్ కర్నూలు మాత్రమే ఏకగ్రీవం ఎందుకు అయిందని ప్రశ్న
  • మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్‌ను పక్కన పెట్టారని విమర్శలు
తాను మాదిగల తరఫున గట్టిగా మాట్లాడితే... తన ముఖ్యమంత్రి సీటుకు మాలలు ఎసరు పెడతారనే భయం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సీఎం సీటును కాపాడుకోవడం కోసం మాలలతో కుమ్మక్కై... మాదిగలకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తొలి నుంచి తన గెలుపుకు రెడ్ల కంటే మాదిగలే సహకరించారని రేవంత్ రెడ్డి చెబుతుంటారని, కానీ ఆ మాటలు పైపైకి మాత్రమే అని విమర్శించారు. తాను జెడ్పీటీసీగా... ఎమ్మెల్సీగా... ఎమ్మెల్యేగా... ఎంపీగా గెలవడానికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కావడానికి మాదిగలు సహకారం ఉందని పైపైకి మాత్రమే చెబుతున్నారన్నారు.

తాను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఉన్న నాగర్ కర్నూలు లోక్ సభ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ ఉండగా, మల్లు రవి పేరును కాంగ్రెస్ పార్టీ ఎలా ఏకగ్రీవం చేసిందని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారని, ఇక్కడ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉన్నారని, సీఎంగా రేవంత్ రెడ్డి కూర్చున్నారని... ఇలాంటి సమయంలో నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరు ఎలా ఏకాభిప్రాయం అయింది? అని నిలదీశారు. ఏకాభిప్రాయం కాని నియోజకవర్గాలు ఇంకా ఉన్నప్పటికీ... ఇది మాత్రమే ఎందుకు అయిందో చెప్పాలన్నారు. ఏకాభిప్రాయం అన్నారంటే రేవంత్ రెడ్డి కూడా మల్లు రవికి అంగీకారం తెలిపినట్లే అవుతుందన్నారు.

రేవంత్ రెడ్డి ఓటేసే సొంత గ్రామం ఉన్న నియోజకవర్గం నాగర్ కర్నూలు అని... అక్కడి నుంచి సంపత్ కుమార్ ఉన్నప్పటికీ ఆయన పేరును ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఓ భయం పట్టుకుందని... మాదిగలను నమ్మించడానికి మాటలు చెప్పాలి కానీ... మాదిగల తరఫున తను గట్టిగా మాట్లాడితే తన ముఖ్యమంత్రి సీటుకు మాలలు ఎసరు పెడతారనే భయం ఆయనకు ఉన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ముఖ్యమంత్రి పదవి కోసం కాచుకొని కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఇలాంటి సమయంలో మల్లు రవిని పక్కన పెట్టి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్‌కు టిక్కెట్ ఇప్పించాలని రేవంత్ రెడ్డి అనుకుంటే... మల్లికార్జున ఖర్గే, కొప్పుల రాజు వంటి వారు తన సీఎం సీటుపై తనను కూర్చోకుండా చేస్తారనే భయం ఆయనను వెంటాడుతోందన్నారు. అందుకే మాదిగలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు సీటు సంపత్ కుమార్‌కు రాకుండా అడ్డుకున్నట్లుగా అర్థమవుతోందన్నారు.
Manda Krishna Madiga
Telangana
Revanth Reddy
Congress

More Telugu News