UP Double Murder: హంతకుడిని ఎన్ కౌంటర్ చేయొద్దు ప్లీజ్.. పోలీసులకు బాధిత తండ్రి విజ్ఞప్తి

A No Encounter Request For UP Cops From Father Of 2 Boys Killed By Barber
  • దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీ డబుల్ మర్డర్ కేసు
  • తన పిల్లలను ఎందుకు చంపారో తెలుసుకోవాలని వినతి
  • ఇప్పటికే ఓ హంతకుడు ఎన్ కౌంటర్ లో మృతి
  • పోలీసులకు లొంగిపోయిన మరో నిందితుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ డబుల్ మర్డర్ కేసులో రెండో నిందితుడు రాయ్ బరేలి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ పిల్లలను చంపింది తన సోదరుడేనని, తనకు ఏ పాపం తెలియదని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనంతరం రాయ్ బరేలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని ఎన్ కౌంటర్ చేయొద్దంటూ బాధిత చిన్నారుల తండ్రి పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. తన పిల్లలు ఇద్దరినీ చంపడానికి కారణం ఏంటో విచారించి తెలుసుకోవాలని కోరాడు. ఇద్దరు నిందితులలో ఒకరు ఇప్పటికే ఎన్ కౌంటర్ లో చనిపోయాడని గుర్తుచేస్తూ.. రెండో నిందితుడు కూడా చనిపోతే అసలు విషయం తెలియకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు..

ఉత్తరప్రదేశ్ లోని బుదౌన్ లో మంగళవారం సాయంత్రం దారుణం జరిగింది. స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వినోద్ అనే వ్యక్తి ఇద్దరు కుమారులు హత్యకు గురయ్యారు. ఆయన ఇంటి పక్కనే ఉన్న బార్బర్ షాప్ ఓనర్ సాజిద్, ఆయన తమ్ముడు జావేద్ ఈ నేరానికి పాల్పడ్డారు. డబ్బులు అప్పు కావాలంటూ వచ్చి, పిల్లలను టెర్రస్ పైకి తీసుకెళ్లి చంపేశారని వినోద్ భార్య పోలీసులకు తెలిపారు. ఈ దారుణ ఘటనలో వినోద్ పిల్లలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోగా.. మూడో అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని, బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, పిల్లలను చంపేసి సాజిద్, జావేద్ పారిపోయే ప్రయత్నం చేయగా.. చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై సాజిద్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

జావేద్ మాత్రం తప్పించుకుని పారిపోయాడు. పోలీసు విచారణ సందర్భంగా సాజిద్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఈ నేపథ్యంలో జావేద్ సోషల్ మీడియాలో బుధవారం ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ నేరానికి పాల్పడింది తన సోదరుడు సాజిద్ మాత్రమేనని, తనకే పాపం తెలియదని అందులో చెప్పాడు. తనకూ ఈ నేరంలో భాగం ఉందని ప్రచారం జరగడంతో భయపడి దాక్కున్నట్లు వివరించాడు. సాజిద్ ఎన్ కౌంటర్ లో చనిపోవడంతో పోలీసుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. గురువారం ఉదయం రాయ్ బరేలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జావేద్ లొంగిపోయాడు. ఈ క్రమంలో చనిపోయిన పిల్లల తండ్రి వినోద్ స్పందిస్తూ.. జావేద్ ను విచారించి పిల్లలను చంపడానికి కారణమేంటనే వివరాలు తెలుసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
UP Double Murder
No Encounter
Request To Police
UP Police
Boys Father
Crime News
Uttar Pradesh

More Telugu News