KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం

KTR questions on cm revanth reddy over farmer issues
  • ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? అని నిలదీత
  • హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ప్రశ్న
  • అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందన్న కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 'ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?' అని నిలదీశారు. ఈ ప్రభుత్వం నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని... నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? 
ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..?? ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ?? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా? అని దుయ్యబట్టారు.

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఎద్దేవా చేశారు. ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదని మండిపడ్డారు. ఇప్పుడు.. నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని ప్రశ్నించారు. 

గుర్తు పెట్టుకోండి..!! ఎద్దు ఏడిచిన వ్యవసాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత  రైతు సమితి.. పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. జై కిసాన్... జై తెలంగాణ అని ముగించారు.
KTR
Revanth Reddy
BRS
Telangana
Congress
farmer

More Telugu News