Delhi Capitals: కెప్టెన్‌ని ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్.. వీడియో ఇదిగో

Delhi Capitals announce Rishabh Pant as skipper for IPL 2024
  • ఐపీఎల్ 2024 సీజన్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరు ప్రకటన
  • 'వెల్‌కమ్ కెప్టెన్' అంటూ ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఫ్రాంచైజీ
  • విశాఖపట్నంలో జరిగిన ప్రీ-సీజన్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొన్నాడని వెల్లడి
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2024 ఎడిషన్ షురూ కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. 2024 సీజన్‌కు కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరుని ప్రకటించింది. ‘‘ఐపీఎల్ రాబోయే ఎడిషన్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 14 నెలల తర్వాత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ తిరిగి క్రికెట్‌ ఆడబోతున్నాడు. విశాఖపట్నంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ-సీజన్ ట్రైనింగ్ క్యాంపులో పంత్ పాల్గొన్నాడు’’ అని వెల్లడించింది. కెప్టెన్‌గా పంత్ పేరుని ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక వీడియోను రూపొందించి షేర్ చేసింది.

రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు పంత్ దూరమయ్యాడు. దీంతో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు పంత్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి కెప్టెన్‌గా పంత్ ఎంట్రీ ఇవ్వనుండడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్, టీమ్ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందిస్తూ.. పంత్‌కు స్వాగతం పలికారు. రిషబ్‌ని తిరిగి కెప్టెన్‌గా ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నామని అన్నారు. ధైర్యంగా ఆడడం పంత్ బ్రాండ్ అని మెచ్చుకున్నారు. కొత్త సీజన్‌ లో నూతనోత్సాహంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌ని మార్చి 23న చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.
Delhi Capitals
IPL 2024
Rishabh Pant
Cricket

More Telugu News