Supreme Court: ఎలక్టోరల్ బాండ్లపై ఎస్‌బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court orders SBI to disclose all details about electoral bonds
  • వివరాలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనన్న రాజ్యాంగ ధర్మాసనం
  • క్రమసంఖ్యతో సహా చెప్పాల్సిందేనంటూ ఆదేశాలు
  • గురువారం సాయంత్రం 5 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం
  • బ్యాంకు నుంచి వివరాలు అందినవెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈసీకి ఆదేశం
ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్‌బీఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు అధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోర్టుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.  అంతేకాదు, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌ను ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Supreme Court
SBI Electoral Bonds
Election Commission
Justice Dy Chandra Chud
Political Parties

More Telugu News