YS Sunitha Reddy: వైసీపీ పునాదులు వివేకా, కోడికత్తి రక్తంతో నిండి ఉన్నాయి.. వైఎస్ భారతికి ఓ విన్నపం: సునీత

The foundation of YSRCP filled with Viveka and kodi kathi blood says YS Sunitha
  • సాక్షి పత్రికలో తమపై నిందలు వేస్తున్నారని సునీత మండిపాటు
  • మీరు ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏమిటని మండిపాటు
  • వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు రావాలని సూచన
తన తండ్రి వైఎస్ వివేకా జీవితాంతం వైఎస్సార్ కోసమే పని చేశారని వివేకా కూతురు సునీత చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారని తెలిపారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని ఆలోచించేవారని... అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా మనకు దూరమై ఐదేళ్లు గడిచిపోయిందని... హంతకులకు ఇంత వరకు శిక్ష పడలేదని అన్నారు. కడపలో జరిగిన వివేకా సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ సీఎం అయిన తర్వాత కూడా హంతకులకు శిక్ష పడలేదని సునీత అన్నారు. వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేసే బాధ్యత జగన్ పై ఉందని చెప్పారు. అంతఃకరణశుద్ధి అంటే ఏమిటో మీకు తెలుసా? అని జగన్ ను ప్రశ్నించారు. ఈ నేరాన్ని మేము చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? అని అడిగారు. మీరు ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వివేకా హంతకులను పట్టిస్తే రూ. 5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించిందని.. మమ్మల్ని పట్టించి ఆ బహుమతిని అందుకోండని అన్నారు. 

సాక్షి పత్రికలో తమపై నిందలు వేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని... పదేపదే తమపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని సునీత ప్రశ్నించారు. సాక్షి ఛైర్ పర్సన్ భారతికి ఓ విన్నపం చేస్తున్నానని... తమకు సంబంధించి మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి, ఆధారాలు ఉండి పోలీసులకు ఇవ్వకపోవడం నేరమని చెప్పారు. వ్యక్తిత్వం మీద బురద చల్లడం దారుణమని అన్నారు. 

వైసీపీ పునాదులు రక్తంతో నిండి ఉన్నాయని సునీత అన్నారు. వివేకా రక్తం, కోడికత్తి రక్తం వైసీపీ పునాదుల్లో ఉన్నాయని చెప్పారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. వైసీపీ నుంచి బయటకు రాకపోతే ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుందని చెప్పారు. 
YS Sunitha Reddy
YS Viveka Murder Case
Jagan
YS Bharathi
YSRCP

More Telugu News