Movie Reviews: సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలకు అనుమతించొద్దు.. కేరళ హైకోర్టుకు అమికస్ క్యూరి సిఫార్సు

No movie reviews within 48 hours of release amicus curiae appointed by Kerala HC recommends
  • సినిమాపై ప్రేక్షకులకు సొంత అభిప్రాయం ఏర్పడుతుందని సూచించిన అమికస్ క్యూరి
  • సమాచారాన్ని అందించడమే రివ్యూ ఉద్దేశమని, డబ్బు వసూళ్ల కోసం కాదని వ్యాఖ్య
  • రివ్యూల ట్రెండ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై అమికస్ క్యూరి సలహా కోరిన కోర్టు
సినిమా రివ్యూలు థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, సినీ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నాయంటూ చర్చ జరుగుతున్న వేళ కేరళ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలు పోస్ట్ కాకూడదని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) శ్యామ్ పద్మన్ కేరళ హైకోర్టుకు సిఫార్సు చేశారు. దీనివల్ల ప్రేక్షకులు సినిమాపై తమ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని, ఎవరో ఓ వ్యక్తి అభిప్రాయం వారిపై పడే అవకాశం ఉండదని ఆయన సూచించారు. ప్రజలకు సమాచారం, అవగాహన కల్పించడమే రివ్యూల ఉద్దేశమని, ప్రజలకు హాని కలిగించడం, డబ్బు వసూళ్లకు పాల్పడడం రివ్యూ ఉద్దేశంకాదని శ్యామ్ వ్యాఖ్యానించారు.

నిర్మాతలు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే సినిమాలపై ప్రతికూల రివ్యూలు వస్తున్నాయని ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. నిర్మాతలపై నష్టం వాటిల్లకుండా రివ్యూలను అరికట్టేలా ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని శ్యామ్ సూచించారు. సినిమా రివ్యూలు ట్రెండ్‌గా మారిన పరిస్థితులను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను పరిశీలించిన కేరళ హైకోర్ట్... సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అమికస్ క్యూరిని నియమించింది. 

కాగా రివ్యూలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతేడాది నుంచి కేరళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నవంబర్ 2023లో హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రేక్షకులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడమే రివ్యూ ఉద్దేశమని, భావప్రకటనా స్వేచ్ఛ మాటున సినీ ఇండస్ట్రీ వ్యక్తులను బలి కానివ్వలేమని జస్టిస్ దేవన్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఇతర భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ల పరిశీలన సందర్భంగా న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. సినిమాలపై నెగిటివ్ రివ్యూలు లేదా ప్రచారాలు చేపట్టే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలంటూ రాష్ట్ర డీజీపీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వసూళ్ల కోసం ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అక్టోబర్ 2023న కొచ్చి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు కూడా నమోదయింది.
Movie Reviews
Kerala High court
Movie News
Kerala

More Telugu News