Narendra Modi: ఈ నెల 17న చిలకలూరిపేట సభ... జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ విమానం!

Modi plane likely land on national highway emergency runway near Korisapadu
  • ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు
  • చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ
  • హాజరు కానున్న ప్రధాని మోదీ
  • కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు

ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో, ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఐదారు లక్షల మంది వస్తారని అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తుండడంతో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సభకు విచ్చేస్తున్న ప్రధాని మోదీ విమానం బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై దిగనున్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో, కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర రన్ వేను జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్  డైరెక్టర్, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నేడు పరిశీలించారు. ఇక్కడి నుంచి బొప్పూడి సభా వేదిక దగ్గర కావడంతో రన్ వేపై మోదీ విమానం దిగేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. 

యుద్ధ సమయాలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో రవాణా, అత్యవసర సేవల కొరకు జాతీయ రహదార్లపై అత్యవసర రన్ వేలు నిర్మించిన సంగతి తెలిసిందే. కొరిశపాడుతో పాటు ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద కూడా ఎమర్జెన్సీ రన్ వేలు నిర్మించారు. కొరిశపాడు వద్ద గతంలో ట్రయల్స్ కూడా నిర్వహించారు.

  • Loading...

More Telugu News