Congress: మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్

Congress criticized Mamata Banerjee severely
  • సీట్ల సర్దుబాటు లేకుండా.. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై మండిపాటు
  • ఏకపక్ష ప్రకటనల ద్వారా సీట్ల సర్దుబాటు జరగదన్న జైరాం రమేశ్
  • మమతా బెనర్జీ మోదీకి భయపడుతున్నారని అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్య

విపక్షాల ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధానమంత్రి బాధపడతారేమోనని మమతా బెనర్జీ భయపడుతున్నారని హస్తం పార్టీ విమర్శించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం కోసం కాంగ్రెస్ పదేపదే ప్రయత్నించిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని చర్చల ద్వారా ఖరారు చేయాలని, ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో భావిస్తోందని పేర్కొన్నారు. 

ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ... ఇండియా కూటమిలో ఎక్కువ కాలం కొనసాగితే మోదీ అసంతృప్తికి గురవుతారని మమతా బెనర్జీ భయపడుతున్నారని ఆరోపించారు. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ ను కలుపుకోవడం లేదనే సందేశాన్ని పీఎంవో కార్యాలయానికి పంపించారని అన్నారు. కాగా సీట్ల సర్దుబాటు చర్చలకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే వ్యాఖ్యానించింది. అంతలోనే తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

  • Loading...

More Telugu News