Election Commissioner: మార్చి 15 కల్లా కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం!

  • అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ నిష్క్రమణతో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి కసరత్తు
  • కమిషనర్ పోస్టుల అభ్యర్థుల ఎంపిక కోసం మార్చి 13,14న ఎలక్షన్ కమిటీ భేటీ
  • మార్చి 15 కల్లా కొత్త కమిషనర్ల ఎంపికకు అవకాశం
Two election commissioners likely to be appointed by March 15

మార్చి 15 కల్లా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను కేంద్రం నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యే అవకాశం, మరో మూడేళ్ల సర్వీసు మిగిలున్నా ఆయన రాజీనామా చేయడం కలకలం రేపింది. శుక్రవారం ఆయన రాజీనామా సమర్పించగా శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోయెల్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం, న్యాయమంత్రిత్వ శాఖ ఈ విషయమై ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గోయల్ రాజీనామాతో ఎన్నికల కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. 

ఈ నేపథ్యంలో నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఇందులో హోం శాఖ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగం సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తొలుత కమిషనర్ల పోస్టులకు ఐదుగురు అభ్యర్థులు ఉన్న రెండు జాబితాలను సిద్ధం చేస్తుంది. ఆ తరువాత ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ ఈ రెండు జాబితాల్లో నుంచి ఇద్దరిని కమిషనర్లుగా ఎంపిక చేస్తుంది. అనంతరం, రాష్ట్రపతి కమిషనర్ల నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. మార్చి 13 లేదా 14న సెలక్షన్ కమిటీ భేటీ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ మరుసటి రోజే కొత్త కమిషనర్లు నియమితులయ్యే అవకాశం ఉందని సమాచారం. 

రాజ్యాంగంలోని 324 అధీకరణ ప్రకారం ఎన్నికల కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటూ కొందరు ఎన్నికల కమిషనర్లు కూడా ఉండాలి. వీరి సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కాగా, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త చట్టం అమలుకు ముందు సీనియర్ ఈసీ అధికారిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేవారు.

More Telugu News