Hardeep Singh Nijjar: కెనడాలో హత్యకు గురైన ఉగ్రవాది హర్దీప్ సింగ్ కిల్లింగ్ వీడియో ఇదిగో!

Hardeep Singh Nijjars Killing Video Footage Out
  • సంచలనం సృష్టించిన నిజ్జర్ హత్య
  • గురుద్వారా నుంచి బయటకు వచ్చాక కాపు కాసి కాల్చి చంపిన దుండగులు
  • నిజ్జర్ హత్యకేసులో భారత ప్రమేయం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధాని వ్యాఖ్యలు
  • ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ట్రూడో వ్యాఖ్యల ప్రభావం
భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. సాయుధ వ్యక్తులు కొందరు ఆయనను కాల్చి చంపుతుండగా ఈ వీడియో రికార్డయింది. కెనడాకు చెందిన సీబీసీ న్యూస్ దీనిని కాంట్రాక్ట్ హత్యగా పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. 18 జూన్ 2023న సాయంత్రం బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న సమయంలో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. 

అత్యంత సమన్వయంతో ఈ దాడి జరిగిందని, రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు నిజ్జర్‌ను హత్యచేసినట్టు సీబీసీ న్యూస్ పేర్కొంది. కాగా, నిజ్జర్ హత్య పెను సంచలనం సృష్టించింది. భారత్-కెనడా మధ్య స్నేహ సంబంధాలను దెబ్బతీసింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు సంబంధాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి.

హత్య జరిగిన సమయంలో నిజ్జర్ బూడిదరంగు డాడ్జ్‌ రామ్ పికప్ ట్రక్‌లో గురుద్వారా పార్కింగ్ స్థలం నుంచి నిజ్జర్ బయలుదేరాడు. ట్రక్ ఎగ్జిట్‌కు చేరుకుంటున్న సమయంలో ఓ తెల్లని సెడాన్ కారు అడ్డంగా వచ్చింది. ఆ వెంటనే ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి నిజ్జర్‌పై తూటాల వర్షం కురిపించి కారులో పరారయ్యారు.

సంఘటన జరిగిన సమయంలో అక్కడికి సమీపంలోని మైదానంలో సాకర్ ఆడుతున్న ఇద్దరు సాక్షులు పరిగెత్తుకుంటూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తుపాకుల శబ్దం వచ్చినవైపు పరిగెత్తి దుండగులను వెంబడించే ప్రయత్నం చేశారు. 

సాక్షుల్లో ఒకరైన భూపీందర్‌సింగ్ సిద్దూ మాట్లాడుతూ.. గాయపడిన నిజ్జర్‌కు సాయం చేయమని స్నేహితుడు మల్కిత్‌ సింగ్‌కు చెప్పి తాను ఆ ఇద్దరు వ్యక్తులను వెంబడించినట్టు చెప్పాడు. తాను నిజ్జర్ చాతీని నొక్కేందుకు ప్రయత్నించానని, అతడు శ్వాస తీసుకుంటున్నాడో, లేదో చూసేందుకు కదిపి చూశానని మల్కిత్ తెలిపాడు. కానీ, అతడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. సందు చివర వచ్చి ఆగిన కారులో నిందితులు ఇద్దరు ఎక్కారని, అందులో అప్పటికే మరో ముగ్గురు ఉన్నట్టు సింగ్ తెలిపాడు.
Hardeep Singh Nijjar
Canada
Surrey
Nijjar Murder
Terrorist

More Telugu News