R Krishnaiah: టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలంటూ 11న ఛలో హైదరాబాద్: ఆర్ కృష్ణయ్య

  • టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్
  • డీఎస్సీతో పాటు టెట్ నిర్వహణ ఆనవాయితీగా వస్తోందని వెల్లడి
  • టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టుకు రాయడానికి అర్హత ఉండదన్న కృష్ణయ్య

తెలంగాణలో టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... డీఎస్సీతో పాటు టెట్ నిర్వహణ ఆనవాయితీగా వస్తోందన్నారు. పక్క రాష్ట్రాల్లో టెట్ వేసిన విషయం గుర్తించాలని హితవు పలికారు. టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత ఉండదన్నారు.

నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటో చెప్పాలన్నారు. టెట్ నిర్వహించి 6 నెలలు అవుతోందని... అందులో 10 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలన్నారు. గతంలో పోస్టులు తక్కువగా ఉండటం, సిలబస్ మారడం వల్ల చాలామంది అర్హత సాధించలేకపోయారని తెలిపారు.

బీఈడీ, డీఈడీ పాసైన నిరుద్యోగులు టెట్ వేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. వారు అవకాశం కోల్పోతామనే ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 24 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉంటే కేవలం 11 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం ఏమిటన్నారు. 24 వేల టీచర్ పోస్టుల భర్తీ, టెట్ వేసి డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో 11న ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపడుతున్నామన్నారు.

  • Loading...

More Telugu News