ధర్మశాల టెస్టులో 48 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత స్పిన్నర్లు
- టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున ప్రత్యర్థి జట్టు 10 వికెట్లనూ భారత స్పిన్నర్లే పడగొట్టడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి
- 1976 తర్వాత తొలిసారి ప్రత్యర్థి జట్టుని తొలి రోజే కుప్పకూల్చిన స్పిన్నర్లు
- ధర్మశాల టెస్టులో 5 వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్
- అశ్విన్ 4 , రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టడంతో నమోదైన రికార్డు
గత 48 ఏళ్ల క్రికెట్ చరిత్రలో భారత స్పిన్నర్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజున మొత్తం 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంతక్రితం 1976లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదయింది. ఆట తొలి రోజున భారత స్పిన్నర్లు పది వికెట్లు పడగొట్టారు. దానికంటే ముందు 1973లో కూడా ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. చెన్నై వేదికకగా ఇంగ్లండ్‌పై టెస్టు మొదటి రోజున పది వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగి టెస్ట్ మ్యాచ్ తొలి రోజునే ప్రత్యర్థి జట్టుని ఆలౌట్ చేశారు.
కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా 56 ఫస్ట్ క్లాస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఒక ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తక్కువ బంతుల్లో వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారతీయ బౌలర్‌గా అశ్విన్ అవతరించాడు.