Dasoju Sravan: మోదీని దించేయాలని రాహుల్ గాంధీ చూస్తుంటే... రేవంత్ రెడ్డేమో మళ్లీ మోదీయే గెలుస్తారని చెబుతున్నారు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan fires at Revanth Reddy
  • ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేతలకు సూచన
  • కాంగ్రెస్ వాళ్లు గుజరాత్ మోడల్ వద్దంటే రేవంత్ రెడ్డేమో కావాలంటున్నారన్న దాసోజు శ్రవణ్
  • ముఖ్యమంత్రిగా కేంద్రం సహకారం కోరడంలో తప్పులేదు... కానీ ఎన్నికలకు ముందు కాదన్న దాసోజు శ్రవణ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్నారని... సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ఆయనకు ఎలా మాట్లాడాలో చెప్పాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ... ఓ వైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవి నుంచి మోదీని దించేందుకు పాదయాత్ర చేస్తున్నారని, రేవంత్ రెడ్డేమో అదే ప్రధానిని బడే భాయ్ అంటూ ప్రశంసిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం ప్రకారం మోదీ మరోసారి గెలుస్తారనే అభిప్రాయం కలిగించేలా ఉందన్నారు. మోదీ, రేవంత్ రెడ్డిల మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. వారిద్దరిదీ జుగల్ బందీ అని విమర్శించారు.

ఓ వైపు రాహుల్ గాంధీ మొదలు సామాన్య కాంగ్రెస్ కార్యకర్త వరకు గుజరాత్ మోడల్ అబద్ధమని చెబుతుంటే, రేవంత్ రెడ్డేమో గుజరాత్ మోడల్ కావాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మూలసిద్ధాంతాలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎలా మాట్లాడాలో కాంగ్రెస్ అగ్రనాయకులు... రేవంత్ రెడ్డికి చెప్పాలని హితవు పలికారు. ఓ ముఖ్యమంత్రిగా కేంద్రం సహకారం కోరడంలో ఎలాంటి తప్పు లేదని... కానీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అడగడం చూస్తుంటే మరోసారి ప్రధానిగా మోదీని కోరుకుంటున్నట్లుగా అర్థమవుతోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారని, ఇంత నిర్లజ్జగా అబద్ధాలు చెప్పిన వారిని చూడలేదని విమర్శించారు. ఆయన పాథలాజికల్ కంపల్సివ్ లయ్యర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజీని కూడా రిపేర్ చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఆదేశిస్తే రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు.
Dasoju Sravan
Revanth Reddy
Congress
Narendra Modi
Lok Sabha Polls

More Telugu News