Bengaluru: తాగునీటిని వృథా చేస్తే రూ. 5 వేల జరిమానా.. కాపలాకు సెక్యూరిటీగార్డు!

Rs 5000 fine and special guards as Bengaluru societies look to protect water
  • తాగునీటికి కటకటలాడుతున్న బెంగళూరు
  • నాలుగు రోజులుగా సరఫరా కాని నీరు
  • నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నోటీసు జారీచేసిన పామ్ మెడోస్ సొసైటీ
  • వేసవి ముదిరే కొద్దీ ఇది 40 శాతానికి పెరుగుతుందని హెచ్చరిక
  • నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డు
  • ఇలాంటి నోటీసునే జారీచేసిన ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్
మీరు చదివింది నిజమే! తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న వేళ ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే రూ. 5 వేల జరిమానా విధించాలని బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ నిర్ణయించింది. అంతేకాదు, ఎవరూ నీటిని వృథా చేయకుండా చూసేందుకు ఓ సెక్యూరిటీగార్డును కూడా నియమించనుంది. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని పామ్ మెడోస్ సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

నగరంలోని నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఇదొకటి. యలహంక, కనకపుర ప్రాంతాలు కూడా నీటికి కటకటలాడుతున్నాయి. సొసైటీలో నివసిస్తున్న వారికి నోటీసులు జారీచేసిన పామ్ మెడోస్.. గత నాలుగు రోజులుగా బెంగళూరు వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు నుంచి నీళ్లు రావడం లేదని అందులో పేర్కొంది. బోర్‌వెల్స్ ద్వారా నీటిని ఏదో రకంగా అందిస్తున్నామని, త్వరలోనే భూగర్భ జలాలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి ఈ కష్టసమయాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి యూనిట్‌కు నీటి సరఫరాను 20 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 

అందరూ దీనికి కట్టుబడి ఉండాలని, దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే అదనంగా రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది. అంతేకాదు, వేసవి తీవ్రత పెరిగే కొద్దీ 20 శాతం కాస్తా 40 శాతం అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఉల్లంఘనలు పదేపదే చేస్తే జరిమానాలు తీవ్రస్థాయిలో ఉంటాయని పేర్కొన్న సొసైటీ.. నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఓ సెక్యూరిటీగార్డును కూడా నియమిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఇలాంటి నోటీసే ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా జారీచేసింది.
Bengaluru
Water Crisis
Palm Meadows Society
Prestige Falcon City Apartment Owners Association
Karnataka

More Telugu News