Abortion Law: గర్భస్రావం రాజ్యాంగ హక్కు.. ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం

Abortion is a constitutional right France took historic decision
  • పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు
  • ‘మీ శరీరం మీది. ఇంకెవరూ నిర్ణయం తీసుకోలేరు’ అన్న ప్రధాని గాబ్రియేల్
  • హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా హక్కుల కార్యకర్తలు
ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్‌ భవనం ‘వెర్సైల్లెస్ ప్యాలెస్‌’లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించగా.. ఏకంగా 780 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. ‘‘ మీ శరీరం మీది. మీ విషయంలో ఇతరులు నిర్ణయం తీసుకోలేరు" అని ఓటింగ్‌కు చట్టసభలో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యానించారు. ఈ సందేశాన్ని ఇక్కడి నుంచి మహిళలు అందరికీ పంపుతున్నామని ఆయన అన్నారు.

పార్లమెంట్ నిర్ణయాన్ని అక్కడి మహిళా హక్కుల సంఘాలు స్వాగతించాయి. సెంట్రల్ ప్యారిస్‌లో గుమికూడిన అబార్షన్ హక్కుల కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు. పార్లమెంట్‌లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. అనంతరం ‘నా శరీరం నా హక్కు’ అనే సందేశాన్ని కూడా స్క్రీన్‌పై ప్రదర్శించారు. మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.

‘అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కు కాదు’ అంటూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నాటి నుంచి ఫ్రాన్స్‌లో కార్యకర్తలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అబార్షన్‌కు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. అమెరికా సహా ఇతర దేశాల కంటే ఫ్రాన్స్‌లో అబార్షన్ హక్కులను విస్తృతంగా ఆమోదించారు. విస్తృతాంశాలను చట్టంలో పొందుపరిచారు. కాగా దాదాపు 80 శాతం మంది ఫ్రాన్స్ ప్రజలు అబార్షన్ చట్టబద్ధమైనదనే సమర్ధిస్తున్నారు.
Abortion Law
France
Abortion constitutional right
Gabriel Attal

More Telugu News