MS Dhoni: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై?.. ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్

MS Dhoni Says he will gave new role In new season and this creates Retirement Speculation
  • కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం వేచిచూడలేకపోతున్నానంటూ ధోనీ పోస్ట్
  • రిటైర్ కాబోతున్నాడని ఊహాగానాలు
  • కోచ్‌గా లేదా మెంటార్‌గా వ్యవహరించనున్నాడని అభిప్రాయపడుతున్న ఫ్యాన్స్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా? 2024 సీజన్‌లో కొత్త పాత్రలో కనిపించనున్నాడా? అనే సందేహాలు రేకెత్తించేలా ఫేస్‌బుక్ వేదికగా టీమిండియా మాజీ దిగ్గజం ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం వేచిచూడలేకపోతున్నాను. వేచి ఉండండి’’ అంటూ ఫేస్‌బుక్‌లో ధోనీ పెట్టిన పోస్టు అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు తెరతీసింది. ధోనీ చెన్నై జట్టు కెప్టెన్‌గా వ్యవహరించున్నాడా? లేక ఇంకేదైనా పాత్ర పోషించనున్నాడా? అనే చర్చ మొదలైంది. కోచ్ గా వ్యవహరించబోతున్నారా?.. అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెంటార్‌గా పని చేస్తారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ధోనీ రిటైర్మెంట్‌ను ఊహించామని, చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడని మరికొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు.

కాగా ఐపీఎల్-2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడని అంతా భావించారు. 2023లోనే రిటైర్మెంట్ ఉంటుందని అంచనా వేసినప్పటికీ ధోనీ నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే అతడి ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్‌లో ఆడడం ఖాయమని అంతా భావించారు. ఈ సమయంలో ధోనీ పెట్టిన పోస్టు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌ని ధోనీ ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమ కోసం ఆటను కొనసాగిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
MS Dhoni
IPL
Cricket
IPL2024
Chennai Super Kings

More Telugu News