IPL 2024: సన్‌రైజర్స్‌కు కొత్త సారథిగా ప్యాట్ కమిన్స్

Sunrisers Hyderabad appoint Pat Cummins as captain ahead of IPL 2024
  • ఐదెన్ మార్క్రమ్ స్థానంలో ప్యాట్ కమిన్స్
  • ఐపీఎల్ వేలంలో రూ.20.50 కోట్లకు కమిన్స్‌ను కొన్న ఎస్ఆర్‌హెచ్
  • ఈ నెల 23న కోల్‌కతాతో హైదరాబాద్ తొలి మ్యాచ్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐదెన్ మార్క్రమ్‌ను తొలగించింది. అతని స్థానంలో ఇటీవల వేలంలో ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా మీడియం పేసర్ ప్యాట్ కమిన్స్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఆసీస్‌కు సారథిగా ఉన్న కమిన్స్ 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌ను అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమిన్స్ కెప్టెన్సీలో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కసితో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా, గడిచిన రెండు సీజన్లలో కూడా హైదరాబాద్ జట్టు ఇద్దరు కొత్త కెప్టెన్లతోనే బరిలోకి దిగింది. 2022లో కేన్ విలియమ్సన్, 2023లో మార్క్రమ్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు మూడో కొత్త సారథితో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. అలాగే ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు కోచింగ్ స్టాఫ్‌ను కూడా మార్చింది. హెడ్ కోచ్‌గా ఉన్న బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరిని నియమించుకుంది. బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేల్ స్టెయిన్ స్థానంలో జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను తీసుకుంది. ఇలా ఈసారి ఎస్ఆర్‌హెచ్ కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది.  

ఇదిలాఉంటే.. సన్‌రైజర్స్ చివరిసారిగా 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి మరోసారి విజేతగా నిలవలేదు. ఇక ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌ను కోల్‌కతాతో ఆడనుంది. మార్చి 23వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
IPL 2024
Pat Cummins
Sunrisers Hyderabad
Cricket
Sports

More Telugu News