Kotamreddy Sridhar Reddy: టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు.. జగన్ పిచ్చి పీక్స్ కి వెళ్లిందన్న కోటంరెడ్డి

Kotamreddy fires on Jagan amid police raids in TDP leaders houses
  • మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో సోదాలు
  • విజితారెడ్డి ఇంటికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • డబ్బులు దాచారంటూ పోలీసులు హంగామా చేశారని కోటంరెడ్డి మండిపాటు
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులో మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజితారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో తనిఖీలు చేశారు. విజితారెడ్డి ఇంటికి 20 మంది పోలీసులు వచ్చారు. ఇంట్లోని బీరువాలను, వస్తువులను తనిఖీ చేశారు. ఇంట్లో కేవలం రూ. 25 వేల నగదు మాత్రమే దొరకడంతో వెనుదిరిగారు. తనిఖీల నేపథ్యంలో విజితారెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల సోదాలపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని కోటంరెడ్డి అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్షసాధింపు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి, ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారని అన్నారు. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ, ఇంట్లోని బీరువా, వస్తువులను చిందరవందర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెన్ని చేసినా, ఎన్నికల లోపే, ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తామనీ, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని... అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.
Kotamreddy Sridhar Reddy
Telugudesam
P Narayana
Jagan
YSRCP
AP Politics

More Telugu News