Chandrababu: కోడెల శివప్రసాద్ ను తలచుకుని భావోద్వేగాలకు గురైన చంద్రబాబు

Chandrababu remembers Kodel Sivaprasad
  • పల్నాడు జిల్లా దాచేపల్లిలో రా కదలిరా సభ
  • పల్నాటి పులి కోడెల శివప్రసాద్ అంటూ స్మరించుకున్న చంద్రబాబు
  • పల్నాడులో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆగ్రహం
  • మర్యాదకు మర్యాద... దెబ్బకు దెబ్బ ఉంటుందని స్పష్టీకరణ

పల్నాడు జిల్లా దాచేపల్లి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ దశలో భావోద్వేగాలతో ప్రసంగించారు. ఇక్కడికి వచ్చాక తన మనసెందుకో భారంగా ఉందని అన్నారు. ఇక్కడ తన ప్రాణ సమానులైన టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లను పోగొట్టుకున్నానని తెలిపారు. 

ఈ సందర్భంగా దివంగత నేత కోడెల శివప్రసాద్ ను చంద్రబాబు స్మరించుకున్నారు. పల్నాటి పులి అని మనమంతా పిలుచుకునే కోడెల శివప్రసాద్ ను మానసికంగా వేధించి, ఇబ్బంది పెట్టి  చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా కోసం ఇక్కడ ఎంతోమంది బలైపోయారని తెలిపారు. 

జై జగన్ అంటే  వదిలేస్తామని చెబితే, నా ప్రాణం పోయినా ఆ మాట అనను అంటూ కార్యకర్త చంద్రయ్య ప్రాణత్యాగం చేశాడని, అలాంటి కార్యకర్తను నా జీవితంలో మర్చిపోలేనని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశానని గుర్తుచేసుకున్నారు. చంద్రయ్య ఎలా మరణించాడో నా శరీరంలోని ప్రతి అణువు గుర్తుచేస్తుంది... ఖబడ్దార్, గుర్తుపెట్టుకోండి... నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లోంచి బయటికి రాలేరు అని హెచ్చరించారు. 

జంగమహేశ్వరంలో ప్రాణాలు తీస్తారని తెలిసినా జెండా వదలని జల్లయ్య, పెద గార్లపాడులో పురంశెట్టి అంకులు, పోలీసు విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురంకు చెందిన దోమతోటి విక్రమ్, హైదరాబాద్ లో ఉన్న అనిల్ ను విచారణ పేరుతో పిలిపించి చంపేశారు... నరసరావుపేటలో వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం పోరాడిన మైనారిటీ సోదరుడు ఇబ్రహీం... వీళ్లని తాను మర్చిపోనని అన్నారు. 

పల్నాడు జిల్లాలో 30 మందిని పొట్టనబెట్టుకున్నారు...  నరహంతకులను వదిలిపెట్టేది లేదు... మర్యాదకు మర్యాద... దెబ్బకు దెబ్బ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. 

ప్రత్తిపాటి శరత్ ను ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు... జగన్ నువ్వు చేసిన నేరాలు, ఘోరాలకు నిన్ను ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి?... ఈ జీవితం చాలదు నీకు... శాశ్వతంగా జైలుశిక్ష పడితే తప్ప నీ తప్పులకు శిక్ష సరిపోదు అని అన్నారు. కుర్చీని మడిచినట్టు మడిచి నిన్ను కూడా మీ ఊరికి పంపిస్తా అని హెచ్చరించారు. సిద్ధం సిద్ధం అంటున్నాడు... దేనికి సిద్ధం... ఓడిపోవడానికి సిద్ధం. నువ్వు సీటు ఇస్తానంటే వద్దని పారిపోతున్నారు... అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News