Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

Five Day Work Week Salary Hike Expected By June 2024
  • జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం
  • వారానికి రెండు రోజుల సెలవులతోపాటు వేతన పెంపు కూడా
  • కేంద్రం ఆమోదం తెలపడమే తరువాయి
బ్యాంకు ఉద్యోగులకు ఇది శుభవార్తే. వారి సుదీర్ఘ డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది. దాంతోపాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వశాఖ ఇందుకు ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచే ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు గతంలో లేఖ రాసింది. 

ఐదు రోజుల పని వల్ల ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు తగ్గిపోవని, అలాగే ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అందులో హామీ ఇచ్చింది. ఐదు రోజుల పనిదినాలు ఇప్పటికే ఆర్బీఐ, ఎల్ఐసీలో అమల్లో ఉన్నాయని, కాబట్టి ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 

బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు కల్పించాలన్న డిమాండ్ 2015 నుంచి ఉంది. ప్రస్తుతం నెలలో ప్రతి రెండు, నాలుగో శనివారం బ్యాంకులు సెలవు పాటిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య గతేడాది జరిగిన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు వేతనం 17 శాతం పెరిగింది. కేంద్రం కనుక అమోదిస్తే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు రంగంలో 3.8 లక్షలమంది అధికారులు సహా 9 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వీక్లీ ఆఫ్, వేతనపెంపు ఫలాలు అందుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది.
Bank Employees
Salary Hike
Five-Day Work Week

More Telugu News