Rahul Gandhi: రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారు... ప్రధాని పదవి చేపడతారు: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy says rahul gandhi will contest from telangana
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఒక్క సీటును కూడా గెలుచుకోనివ్వమన్న పొంగులేటి  
  • ఇందిరమ్మ రాజ్యంలో దోపిడీ, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశామన్న మంత్రి
  • పేపర్ లీకేజీలు లేని పరీక్షలు నిర్వహిస్తామని హామీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కొత్తగూడెంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోనివ్వమని సవాల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌‌ని తిరస్కరించారని, వారి వైఖరిని అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వ దోపిడీ, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి తీరుతామని, ఇది దొరల ప్రభుత్వం కాదు.. ఇందిరమ్మ రాజ్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగింటిని ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి హామీలో భాగంగా ఉచిత బస్సు, రూ.10 లక్షల మెడికల్ బీమా, రూ.500 గ్యాస్, రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో 25 వేల ఉద్యోగాలకు, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ వేశామన్నారు. ఇచ్చిన మాట మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు.

పేపర్ లీకేజీలు లేని పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేశామన్నారు. తాము కాళేశ్వరం వెళితే కేసీఆర్ దుర్భాషలాడారని.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహా అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News