Chandrababu: ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు: చంద్రబాబు

Chandrababu said this alliance was set by people
  • టీడీపీ-జనసేన ఉమ్మడి సభ
  • తాడేపల్లిగూడెంలో జెండా సభకు భారీగా తరలివచ్చిన శ్రేణులు
  • ఈ సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుందన్న చంద్రబాబు
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన జెండా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు తమతో చేయి కలపాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం విజన్-2029 డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పారు. 

"టీడీపీ, జనసేన పార్టీలు కలిశాక జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఏపీ దశ దిశ మార్చబోతోంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం పాల్జేసిన నేతలను తరిమి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లిగూడెం సభను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. ఈ సభ స్పందన శుభసూచకం... రాష్ట్రానికి త్వరలో నవోదయం. 

ఈ ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి రెండు పార్టీలు చేతులు కలిపి బరిలో దిగాయి. మేం చేతులు కలిపింది మా కోసం కాదు... నా అధికారం కోసమో, పవన్ కల్యాణ్ అధికారం కోసమో కాదు... రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం... రాష్ట్రంలో హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి చేతులు కలిపాం... రైతన్నలను కాపాడేందుకు ఇద్దరం చేతులు కలిపి ముందడుగు వేస్తున్నాం. 

ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఉండలేను. అదే సమయంలో... ప్రశ్నించే, ఎదిరించే తత్వం ఉన్న పవన్ కల్యాణ్ కూడా మౌనంగా ఉండలేరు. అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు, జనం కోరుకున్న పొత్తు, రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం మాతో కలిసి అడుగేయండి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
Chandrababu
TDP
Janasena
Tadepalligudem

More Telugu News