Hanuma Vihari: హనుమ విహారి ఆరోపణలపై స్పందించిన తిరుపతి వైసీపీ కార్పొరేటర్

  • ఓ రాజకీయ నేత కారణంగా ఆంధ్రా టీమ్ కెప్టెన్సీ కోల్పోయానన్న విహారి
  • తన కుమారుడ్ని ఒక్క మ్యాచ్ లోనూ ఆడించలేదన్న నరసింహాచారి
  • పొలిటికల్ పవర్ ఉంటే నా బిడ్డనే కెప్టెన్ గా చేసుకునేవాడ్ని కదా అంటూ వ్యాఖ్యలు
  • హనుమ విహారి తాగుబోతు, తిరుగుబోతు అని ఆరోపణలు
Tirupati YSRCP Corporator Narasimhachari reacts on Hanuma Vihari allegations

తాను ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం ఓ రాజకీయ నేత అని టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఆరోపించడం తెలిసిందే. ఓ యువ ఆటగాడిపై తాను కోప్పడ్డానని, దాంతో అతడి తండ్రి ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేయడంతో, తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని విహారి వివరించాడు. 

దీనిపై యువ క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి, తిరుపతి వైసీపీ కార్పొరేటర్ కుంట్రపాకం నరసింహాచారి స్పందించారు. తన కుమారుడు పృథ్వీ ఆంధ్రా రంజీ టీమ్ కు సెలెక్ట్ అయినప్పటికీ, ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదని అన్నారు. నేను రాజకీయ పలుకుబడి కలిగినవాడ్నే అయితే నా కుమారుడు కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా ఆడాలి కదా... కనీసం తుది 14 మందిలో కూడా ఎందుకు ఉండడు? అని వ్యాఖ్యానించారు. 

"ఎనిమది మ్యాచ్ లు జరిగాయి... నాకే అంత పొలిటికల్ పవర్ ఉంటే మా వాడు ఎనిమిది మ్యాచ్ ల్లో ఆడేవాడు కదా. మావాడ్నే కెప్టెన్ గా చేసుకునేవాడ్ని కదా. మొదటి రోజు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని అతడు (హనుమ విహారి) ఇదంతా చేశాడు. అతడు ఇండియాకు ఆడాడు... ఎంత పరిణితి ఉండాలి? ఎంతటి సానుకూల దృక్పథం ఉండాలి? 

అసలు జరిగింది చెబితే, క్రికెట్ ప్రేమికులు గానీ, ఆంధ్రరాష్ట్ర ప్రజలు కానీ దిగ్భ్రాంతికి గురవుతారు... అతడిని సమర్థిస్తున్న సో కాల్డ్ నాయకులంతా వారి ముఖంపై వారే ఉమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 23 ఏళ్ల కుర్రాడు ఫోన్ లో ఒకటే పనిగా ఏడుస్తూ ఉంటే ఒక తండ్రిగా నేను ఏం చేయాలో అదే చేశాను. పద్ధతి ప్రకారమే ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేశాను. ఇతర తండ్రులు అయితే వేరే నిర్ణయాలు తీసుకునేవారు. 

నేను కూడా క్రీడాకారుడ్నే... ఆ విధంగానే ముందుకు పోయాను. నా ఫిర్యాదు అంతా అతడు (హనుమ విహారి) మా అబ్బాయిని తిట్టాడు, కొట్టడానికి వచ్చాడు అనే దానిపైనే తప్ప ఇతర విషయాల జోలికి పోలేదు. 

అతడొక ఫ్రాడ్. ఈ ఘటన జరిగిన మొదటిరోజే అతడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను బెదిరించాడు" అని నరసింహాచారి వివరించారు. అంతేకాదు, అతడొక తాగుబోతు, తిరుగుబోతు అని కూడా ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News