Wayanad: ఇండియా కూటమిలో మరో విచిత్రం.. రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించిన సీపీఐ

  • వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా అన్నీ రాజాను ప్రకటించిన సీపీఐ
  • సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా భార్యనే అన్నీ రాజా
  • రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా రాని క్లారిటీ
CPI announces Wayanad candidate

ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి తమ అభ్యర్థిగా అన్నీ రాజాను సీపీఐ ప్రకటించింది. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. వయనాడ్ నుంచి గెలుపొందారు. 

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. యూపీలోని రాయబరేలీ నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాయబరేలీ ఎంపీగా సోనియాగాంధీ ఉన్నారు. ఆమె రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో, రాయబరేలీ నుంచి రాహుల్ పోటీ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాకముందే... వయనాడ్ అభ్యర్థిని సీపీఐ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ తో సంప్రదింపుల తర్వాతే తమ అభ్యర్థిని సీపీఐ ప్రకటించిందా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. 

అన్నీ రాజా విషయానికి వస్తే సీపీఐలో ఆమె కీలక నాయకురాలిగా ఉన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు కూడా. సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా భార్యనే అన్నీ రాజా.

More Telugu News