Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

APUWJ representatives met TDP Chief Chandrababu
  • జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందజేత
  • టీడీపీ గెలిస్తే పాత పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి  
  • జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు
  • టీడీపీ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ
ఏపీయూడబ్ల్యూజే(ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాన్ని అందించి... అందులోని అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని చంద్రబాబును కోరారు. 

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరణ, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై దాడులు అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టం, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా, నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల స్కీం పటిష్ఠత వంటి సుమారు 15 అంశాలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పునరుద్ధరించాలని కోరారు. 

జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధుల సమస్యలు విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు రద్దు చేసిన పథకాలు మళ్లీ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో APUWJ అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, IJU జాతీయ కార్యదర్శి సోమ సుందర్, చావా రవి తదితరులు పాల్గొన్నారు.
Chandrababu
APUWJ
Journalists
TDP
Andhra Pradesh

More Telugu News