Nara Bhuvaneswari: ఆ రాక్షసులు లోకేశ్ ను ఏదైనా చేస్తారన్న భయంతో అలా అన్నాను: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari talks about her son Lokesh
  • నిజం గెలవాలి యాత్ర వీడియో పంచుకున్న నారా భువనేశ్వరి 
  • ఓ కార్యక్రమంలో ప్రసంగం
  • లోకేశ్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు ఓ తల్లిగా వద్దన్నానని వెల్లడి
  • కానీ లోకేశ్ అడుగు ముందుకే వేశాడని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర సందర్భంగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తానన్నప్పుడు ఓ తల్లిగా తాను వద్దని చెప్పానని వెల్లడించారు. మానవత్వం మచ్చుకు కూడా లేని రాక్షసులు తనను ఏదైనా చేస్తారన్న భయంతోనే అలా అన్నానని వివరించారు. కానీ లోకేశ్ అడుగు ముందుకే వేశాడని గుర్తుచేసుకున్నారు. 

అమ్మా... నేను ఇంట్లో కూర్చున్నా వాళ్లు ఏమైనా చేయగలరు, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నా అవసరం ఉందంటూ పాదయాత్ర చేశాడని నారా భువనేశ్వరి వెల్లడించారు. కార్యకర్తలే తనకు అండ అని చెప్పాడని, ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే ఆ నిర్ణయం కరెక్టేననిపిస్తోందని పేర్కొన్నారు.

దేశాన్ని కాపాడడానికి చాలా కుటుంబాల నుంచి సైన్యంలోకి వెళుతుంటారని, లోకేశ్ ను కూడా అలాంటి ఓ సైనికుడిగానే భావించానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు నా బిడ్డ అవసరం ఉందని, అతడు ఆంధ్రప్రదేశ్ ను కాపాడతాడని నాకు నమ్మకం ఉందని తెలిపారు. నాకు మా ఆయనపై ఎంత నమ్మకం ఉందో, నా బిడ్డ మీద కూడా అంతే నమ్మకం ఉంది... అతడు తప్పకుండా మీ అందరినీ ముందుకు తీసుకెళతాడని విశ్వసిస్తున్నాను అని స్పష్టం చేశారు.
Nara Bhuvaneswari
Nara Lokesh
Yuvagalam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News