YS Sharmila: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

APCC chief YS Sharmila files complaint against social media accounts at Hyderabad cyber crime police
  • తన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు
  • తనపైన, తన సహచరులపైన అసభ్య కామెంట్లు పెడుతున్నారని ఆవేదన
  • తనపై అసభ్య ప్రచారం చేస్తున్న వారి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్న షర్మిల
  • రెండు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ చానళ్లు, ఇతర సోషల్ మీడియా సైట్లలో మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్ని కలుస్తుండడాన్ని కొందరు సహించలేక దురుద్దేశంతో తనపైన, తన సహచరుల పైన అసభ్య కామెంట్లు పెడుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా పెడుతున్న ఈ పోస్టులు తనను అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం’, ‘దొంగల ముఠా’, ‘వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్టు ఆపరేషన్’ పేరుతో కొన్ని పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్సార్, వైఎస్ జగన్‌కు ఆజన్మ శత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోందని కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ.. మేదరమెట్ల కిరణ్‌కుమార్, రమేశ్ బులగాకుల, పంచ్ ప్రభాకర్ (అమెరికా), ఆదిత్య (ఆస్ట్రేలియా), సత్యకుమార్ దాసరి (చెన్న), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్ రెహ్మత్ పాషా వంటి వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిల ఇచ్చిన ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
YS Sharmila
APCC President
Congress
Cybercrime
Andhra Pradesh
Social Media

More Telugu News