Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటి నెలలో వచ్చిన విరాళాలు వెల్లడి

Ayodhya Ram Mandir receives Rs 25 crore donations in a month
  • మొదటి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు పొందిన అయోధ్య రామాలయం
  • బంగారం, వెండి నగలతో పాటు చెక్కులు, డీడీలు, నగదు రూపంలో పెద్ద మొత్తంలో అందిన కానుకలు, విరాళాలు
  • వెల్లువెత్తుతున్న ఆదాయాన్ని లెక్కించేందుకు ఆటోమేటిక్ కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ
  • నెల రోజుల్లో బాల రామయ్యను దర్శించుకున్న 63 లక్షల మంది భక్తులు
అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది. భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. కానుకలు, విరాళాలను కూడా పెద్ద మొత్తం సమర్పించుకుంటున్నారు. మొదటి నెల రోజుల ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది. తొలి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు అందాయని తెలిపింది. 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీలు, నగదు రూపంలో విరాళాలు వచ్చాయని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 

అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలోకి నేరుగా ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం తమకు తెలియదని వివరించారు. ఆలయంలో వినియోగించని వెండి, బంగారంతో చేసిన పాత్రలు, సామగ్రిని రామ్‌లల్లాకు విరాళంగా ఇస్తున్నారని, భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకుని స్వీకరిస్తున్నామని వెల్లడించారు. కాగా వెల్లువలా వచ్చి పడుతున్న భక్తుల కానుకలు, విరాళాలను సునాయాసంగా లెక్కించడానికి వీలుగా ఆలయంలో ఎస్‌బీఐ నాలుగు ఆటోమేటిక్ హైటెక్నాలజీ కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసిందని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా వెల్లడించారు.

విరాళాలకు సంబంధించిన రసీదులను జారీ చేయడానికి 12 కంప్యూటరైజ్డ్ కౌంటర్లు సిద్దం చేశామని, ట్రస్ట్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల పెట్టెలను కూడా ఏర్పాటు చేశామని ప్రకాశ్ గుప్తా వివరించారు. విరాళాల లెక్కింపు కోసం త్వరలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద గదిని కూడా నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. శ్రీరామనవమి వేడుకల సమయంలో విరాళాలు పెరుగుతాయని రామమందిర్ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఈ సమయంలో అయోధ్య రామాలయాన్ని దాదాపు 50 లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని లెక్కిస్తోంది. కాగా జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా నెల రోజుల వ్యవధిలో 60 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని ప్రకాశ్ గుప్తా పేర్కొన్నారు. 

బంగారం, వెండి వస్తువులు ప్రభుత్వానికి అప్పగింత..

రామ్ లల్లాకు బహుమతులుగా అందిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కరిగించి నిర్వహణ కోసం భారత ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. విరాళాలకు సంబంధించి ఎస్‌బీఐతో ట్రస్టు అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం విరాళాలు, చెక్కులు, డీడీలు, నగదు విరాళాలకు ఎస్‌బీఐ జవాబుదారీగా వ్యవహరిస్తుంది. విరాళాల సేకరణ, వాటిని బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఇప్పటికే కార్యకలాపాలను మొదలుపెట్టిందని అనిల్ మిశ్రా వెల్లడించారు. నగదు విరాళాల లెక్కింపు రోజుకు రెండు సార్లు రెండు షిప్టులలో జరుగుతుందని, ఇందుకు అనుగుణంగా ఎస్‌బీఐ సిబ్బందిని పెంచిందని మిశ్రా వివరించారు.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Ram Lalla
Sri Ramudu

More Telugu News