solar eclipse: 30,000 అడుగుల ఎత్తులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించండి.. ‘డెల్టా ఎయిర్‌లైన్స్’ బంపరాఫర్

Delta Airlines bumper to bumper for total solar eclipse viewing
  • ఏప్రిల్ 8న ఏర్పడనున్న సూర్యగ్రహణ వీక్షణ కోసం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన అమెరికా విమానయాన సంస్థ
  • గ్రహణాన్ని ట్రాక్ చేస్తూ ఆస్టిన్ నుంచి డెట్రాయిట్ వెళ్లనున్న ప్రత్యేక విమానం
  • అందుబాటులో ఉన్న మరో 5 విమానాలు
  • గ్రహణాన్ని వీక్షించేందుకు అనుకూలంగా పెద్ద పెద్ద కిటికీలు ఉన్న విమానాల ఎంపిక

ఖగోళ అద్భుతాలను వీక్షించేందుకు కొందరు ఔత్సాహికులు అమితాసక్తిని కనబరుస్తుంటారు. ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహణాలను సంపూర్ణంగా వీక్షించాలని కోరుకుంటుంటారు. అలాంటి కలలు కంటున్న ఔత్సాహికుల కోసం అమెరికా విమానయాన సంస్థ ‘డెల్టా ఎయిర్‌లైన్స్’ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. భూమికి 30 వేల అడుగుల ఎత్తులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూపిస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో చూపిస్తామని విమానయాన సంస్థ చెబుతోంది. గ్రహణాన్ని ట్రాక్ చేస్తూ ప్రయాణించే విమానంలో టికెట్ బుక్ చేసుకుంటే ఈ అవకాశం లభిస్తుందని పేర్కొంది.

ఏప్రిల్ 8న అమెరికా సెంట్రల్ టైమ్‌ ప్రకారం మధ్యాహ్నం 12:15 గంటలకు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో విమానం బయలుదేరి 4:20 గంటలకు మిషిగాన్‌లోని డెట్రాయిట్ తీసుకెళ్తుందని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఎయిర్‌బస్ ఏ220-300 విశాలమైన కిటికీల ద్వారా సూర్య గ్రహణాన్ని చూడవచ్చని తెలిపింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన విమాన కిటికీ గుండా సూర్యగ్రహణాన్ని స్పష్టంగా వీక్షించవచ్చునని వివరించింది. ఇందుకోసం పెద్ద కిటికీలతో కూడిన విమానాన్ని ఎంచుకున్నామని డెల్టా ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎరిక్ బెక్ తెలిపారు. ఆకాశం నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించిన సంస్థ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా డెల్టా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ డేటా ప్రకారం గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఫ్లైట్ టికెట్లు అన్నీ పూర్తిగా బుక్ అయ్యాయి. అయితే మరో 5 ప్రత్యేక విమానాలను డెల్టా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 8న డెట్రాయిట్ ఒకటి,  లాస్ ఏంజిల్స్ నుంచి 2, సాల్ట్ లేక్ సిటీ నుంచి మరో 2 విమానాలను నడపనున్నట్టు తెలిపింది. ఆకాశంలో విమానాల నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించనున్నప్పటికీ కళ్లకు తగిన సురక్షితమైన కళ్లద్దాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News