Pallavi Prashant: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట

Consolation for Pallavi Prashant in Nampalli court
  • బిగ్ బాస్ సీజన్-7 విజేతగా పల్లవి ప్రశాంత్
  • గ్రాండ్ ఫినాలే  అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఉద్రిక్తతలు
  • ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం... ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు
  • డిసెంబరు 20న అరెస్ట్... డిసెంబరు 22న షరతులతో కూడిన బెయిల్

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానవసరం లేదని కోర్టు పేర్కొంది. 

బిగ్ బాస్ షో ముగిసిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో.... పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు రెండు నెలల పాటు పోలీసుల ఎదుట హాజరవుతుండాలన్న షరతు విధించింది. 

కోర్టు పేర్కొన్న రెండు నెలల సమయం ముగియడంతో పల్లవి ప్రశాంత్ కండిషన్ రిలాక్సేషన్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు... పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన పనిలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం పల్లవి ప్రశాంత్ విజేత ట్రోఫీతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు అతడిని ఊరేగింపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం కావడానికి కారకులయ్యారంటూ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో  ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ2గా అతడి సోదురుడు మనోహర్, ఏ3గా వినయ్ లను చేర్చారు. 

డిసెంబరు 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రెండ్రోజుల అనంతరం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News