Gaganyaan: గగన్‌యాన్ మిషన్‌లో మరో మైలురాయి.. విజయవంతమైన కీలక పరీక్ష

  • మిషన్‌లో వినియోగించే సీఈ20 రాకెట్ ఇంజెన్‌‌పై తుదిదశ పరీక్షలు పూర్తి
  • సోషల్ మీడియాలో వెల్లడించిన ఇస్రో
  • మానవ సహిత యాత్రలకు అనువుగా ఇంజెన్ ఉందని వెల్లడి
ISRO achieves human rating milestone for CE20 Engine in Gaganyaan Mission Program

ఇస్రో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌.. మరో మైలురాయిని చేరుకుంది. ఈ మిషన్‌లో వినియోగించే సీఈ20 రాకెట్‌ ఇంజెన్‌కు సంబంధించి తుది క్రయోజెనిక్ దశ పరీక్షలను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. మానవ సహిత యాత్రలకు అనువుగా ఇంజెన్ సిద్ధం (హ్యుమన్ రేటింగ్) చేసే క్రమంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న జరిగిన తుది పరీక్షల్లో భాగంగా లైఫ్ డిమాన్‌స్ట్రేషన్ టెస్టులు, ఎండ్యూరెన్స్ టెస్టులు, ఇతర సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇంధన ట్యాంకు ఒత్తిడి, ఇంజెన్ భద్రత వంటి అంశాలను ఈ పరీక్షల్లో పరిశీలించారు. 

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మానవరహిత అంతరిక్ష యాత్రను కూడా చేపట్టనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రయోగంలో వినియోగించే సీఈ20 ఇంజెన్ పరీక్షలను కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇంజెన్ థ్రస్ట్, స్పెసిఫిఖ్ ఇంపల్స్ తీరు అంచనాలను అందుకుందని ఇస్రో ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని హైఆల్టిట్యూట్ టెస్ట్ కేంద్రంలో ఈ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. ప్రయోగ సమయంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ఇంజెన్ సామర్థ్యాన్ని టెస్ట్ చేసినట్టు వెల్లడించింది. 

ఇక మానవ మిషన్లకు అనువైనవిగా ఇంజెన్లను నిర్ధారించే క్రమంలో మొత్తం నాలుగు ఇంజెన్లపై 39 హాట్ ఫైరింగ్ టెస్టులు నిర్వహించినట్టు వెల్లడించింది. వివిధ ప్రయోగపరిస్థితుల్లో సుమారు 8810 సెకెన్ల పాటు ఇంజెన్లు మండించి వాటి పనితీరును ముదింపు వేసినట్టు పేర్కొంది. గగన్‌యాన్ మిషన్‌కు ముందు ఇస్రో..వ్యోమమిత్ర మిషన్ చేపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా వ్యోమమిత్ర పేరిట ఓ రోబోట్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించనుంది.

More Telugu News