Akaay: ఇక అంతులేని ఆనందాలు.. విరుష్క దంపతులకు సచిన్ శుభాకాంక్షలు

 Sachin Tendulkar Special Wish To Virat Kohli And Anushka Sharma
  • బాబుకు జన్మనిచ్చిన కోహ్లీ-అనుష్క దంపతులు
  • ప్రపంచం నలుమూలల నుంచీ శుభాకాంక్షలు 
  • మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వులతో నింపుతాడంటూ సచిన్ అభినందనలు
తమకు రెండో సంతానంగా అబ్బాయి పుట్టినట్టు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు నిన్న ప్రకటించారు. ఫిబ్రవరి 15నే బాబు జన్మించినట్టు తెలిపారు. వారికి ఇప్పటికే మూడేళ్ల వామిక ఉంది. ఇప్పుడా కుటుంబంలోకి ‘అకాయ్’ వచ్చి చేరాడు. కోహ్లీ ఆ ప్రకటన చేయడంతోనే ప్రపంచం నలుమూలల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.   

‘‘అనుష్క-విరాట్ కోహ్లీకి అభినందనలు. ఆర్సీబీ కుటుంబంలోని అతి పిన్న వయస్కుడైన అకాయ్‌కు పెద్ద స్వాగతం. ఇది చాలా సంతోషకరమైన వార్త. దేశం ఈ రాత్రి హాయిగా నిద్రపోతుంది’’ అని ఐపీఎల్‌లో కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఒక పోస్టులో పేర్కొంది. ‘‘కింగ్ కోహ్లీ నుంచి ప్రిన్స్ కోహ్లీ వరకు.. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కోహ్లీ కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు’’ అని పంజాబ్ కింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 

‘‘అందమైన కుటుంబంలోకి అమూల్యమైన అకాయ్ వచ్చి చేరినందుకు విరాట్, అనుష్కకు అభినందనలు. ఆ పేరే గదిని వెలుగులతో నింపేస్తుంది. అకాయ్ మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వులతో నింపుతాడు. లిటిల్ చాంప్‌కు ఈ ప్రపంచంలోకి స్వాగతం’’ అని సచిన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. 

జనవరిలో కేప్‌టౌన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు తర్వాత కోహ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆ టెస్టులో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ ఆ మ్యాచ్‌లో 46, 12 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఇది పలు ఊహాగానాలకు కారణమైంది. కోహ్లీ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ జోరుగా పుకార్లు షికారు చేశాయి. అయితే వాటిపై విరుష్క దంపతులు స్పందించలేదు. ఇప్పుడు అకాయ్ జన్మించినట్టు ప్రకటించి ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
Akaay
Sachin Tendulkar
Virat Kohli
Anushka Sharma
Team India

More Telugu News