Zombie Deer Disease: ముంచుకొస్తున్న మరో ముప్పు.. వేగంగా విస్తరిస్తున్న జాంబీ డీర్ డిసీజ్

Zombie Deer Disease Spreading Fast Scientists Ringing Warning Bells
  • హెచ్చరికలు జారీచేసిన కెనడా శాస్త్రవేత్తలు
  • అమెరికాలోని జింకల్లో శరవేగంగా వ్యాప్తి
  • మానవులకూ సోకే ప్రమాదం ఉందని హెచ్చరికలు

ప్రపంచంపై మరో మహమ్మారి దండయాత్రకు సిద్ధమైంది. జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోందని, మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. జాంబీ డీర్ డిసీజ్ అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందే. అమెరికాలోని జింకల్లో ఇది శరవేగంగా విస్తరిస్తోంది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగుచూడడంతో డిసీజ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది.  

అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింక, దుప్పి, కణుజు, క్యారిబో (జింకను పోలివుండే జంతువు) వంటి జంతువులను పరీక్షించాలని అధికారులు ఆదేశించారు. ఈ డిసీజ్‌కు ప్రొటీన్ల మిస్‌ఫోల్డ్ (సరైన ఆకృతి సంతరించుకోకపోవడం) కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రొటీన్లు సరైన ఆకృతి సంతరించుకోకపోవడాన్ని ప్రియాన్స్‌గా వ్యవహరిస్తారు. ఈ డిసీజ్ సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీవ్యవస్థ ద్వారా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడి విచ్ఛిన్నం చేస్తుంది. 

ఇది సోకిన జింకలు చొంగకార్చడం, తూలడం, ఉదాసీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకనే దీనికి జాంబీ డీర్ డిసీజ్ అని పేరు వచ్చింది. కెనడాలో మొదట ఇది జింకల్లో కనిపించింది. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో తొలిసారి ఈ వ్యాధి బయటపడింది. అయితే, ఇది నేరుగా మనుషులకు సోకుతుందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, మానవులకు ఇది సోకే అవకాశాన్ని కొట్టిపడేయలేమని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News