Fali Nariman: ప్రముఖ న్యాయవాది నారీమన్ కన్నుమూత.. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన ఘనత ఆయనది!

  • ఢిల్లీలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస 
  • సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పని చేసిన నారీమన్
  • ఒక యుగం ముగిసిందన్న అభిషేక్ మను సింఘ్వి
Eminent Jurist Fali Nariman passes away

ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఈ ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నారీమన్ వయసు 95 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 

న్యాయ రంగంలో చేసిన సేవలకు గాను నారీమన్ ను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. బాంబే హైకోర్టు లాయర్ గా నారీమన్ తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. 1972లో ఆయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అయితే, అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడంతో... ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన 1975లో సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 

నారీమన్ మృతిపై కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వ ఆవేదనను వ్యక్తం చేశారు. నారీమన్ మృతితో ఒక యుగం ముగిసిందని చెప్పారు. న్యాయ రంగం, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో నారీమన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 

More Telugu News