Kesineni Nani: జగన్ వరకు ఎందుకు... చర్చకు నేను సిద్ధం: చంద్రబాబుకు కేశినేని నాని కౌంటర్

  • రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రావాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
  • అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి చేసినట్టా అంటూ నాని ధ్వజం
  • ఈనాడు చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని విమర్శలు 
Kesineni Nani reacts on Chandrababu challenge to CM Jagan

రాష్ట్రాభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎవరిది స్వర్ణయుగమో, ఎవరిది రాతియుగమో తేల్చుకుందాం అన్నారు. 

దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. జగన్ దాకా ఎందుకు... చర్చకు నేను సిద్ధం అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి అంటారా? లేక, గ్రామ గ్రామానికి ఓ సచివాలయం కడితే అభివృద్ధి అంటారా? అని ప్రశ్నించారు. ఎటు చూసినా జగన్ చేసిన అభివృద్ధి కనిపించడంలేదా? అని నిలదీశారు. ఏదో ఈనాడు పేపర్ మన చేతిలో ఉంది కదా అని రాసేస్తున్నారని మండిపడ్డారు.

ఆ రోజున ముఖ్యమంత్రిని లొంగదీసుకుని ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు 2 వేల ఎకరాల్లో పెద్ద కోట కట్టుకున్నాడని, ఆ కోటలోంచి రామోజీరావు ఆంధ్రాను చూస్తుంటాడని కేశినేని నాని విమర్శించారు. తన కోట అభివృద్ధిని చూసుకున్న రామోజీరావుకు ఇవన్నీ అభివృద్ధి కింద కనిపిస్తాయా అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ కోట లోపల ప్రత్యేకంగా ఒక విమానాశ్రయమే ఉంది, రామోజీ ఫిలిం సిటీయే ఉంది అని అన్నారు. 

"అందుకే ఆయన చంద్రబాబు చేసిందే అభివృద్ధి అనుకుంటున్నాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 ఆయన, అమెరికాలో ఉంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టే కొందరు కుహనా మేధావులు కూడా ఇంతే. అసలైన అభివృద్ధి పల్లెల్లో ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి పల్లెల్లో నిజమైన అభివృద్ధిని తీసుకొచ్చారు" అని కేశినేని నాని వివరించారు.

More Telugu News