Vishnu Vardhan Reddy: ఏపీలో బీజేపీ నేత సీఎం కావాలన్న విష్ణువర్ధన్ రెడ్డి... హైకమాండ్ ఆగ్రహం?

BJP High Command reportedly fires on Vishnu Vardhan Reddy
  • ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు తాము పనిచేయబోమన్న విష్ణు
  • ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్ష
  • విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకులకు ఫిర్యాదులు
  • పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయొద్దన్న అధిష్ఠానం
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. ఏపీలో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

1984లో దేశంలో బీజేపీ రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిందని, అందులో ఒకటి గుజరాత్ లో నుంచి, మరొకటి ఆంధ్రప్రదేశ్ నుంచి అని వివరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి అని అన్నారు. 

ఏపీలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని, డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇతర పార్టీల వారిని సీఎం చేయడానికి బీజేపీ ఎన్నటికీ పనిచేయదని విష్ణువర్ధన్ రెడ్డి నిర్మొహమాటంగా చెప్పేశారు. 

ఏపీలో బీజేపీ నుంచే ముఖ్యమంత్రి రావాలని అన్నారు. ఎవరినో భుజాలపైకి ఎక్కించుకుని ముఖ్యమంత్రిని చేసే పని మాది కాదు అని స్పష్టం చేశారు. మాది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ... ఏపీలో ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు మేమెందుకు పనిచేయాలి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చర్యలు తప్పవని స్పష్టం చేసినట్టు సమాచారం! 

ఏపీలో బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకులకు ఫిర్యాదులు అందగా... బీజేపీ అధినాయకత్వం ఆ ఫిర్యాదులపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని అడిగినట్టు తెలుస్తోంది.
Vishnu Vardhan Reddy
BJP
Andhra Pradesh

More Telugu News