Black Panther: వామ్మో! ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన బ్లాక్‌పాంథర్.. వీడియో ఇదిగో!

Black Panther Roaming Around House In Tamil Nadu Here Is The Video
  • గతేడాది ఆగస్టులో నీలగిరి జిల్లాలో ఘటన
  • వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్
  • చూడ్డానికి భయంగా ఉన్నా బాగుందంటూ నెటిజన్ల కామెంట్లు
ఎలా వచ్చిందో ఏమో. నల్ల చిరుత ఒకటి ఓ ఇంటి వద్దకు వచ్చి చక్కర్లు కొట్టింది. ఇంటి ప్రధాన ద్వారం నుంచే అది అలా హుందాగా నడుచుకుంటూ పోయింది. ఆ సమయంలో ఎవరైనా తలుపు తీసి ఉంటే పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన గతేడాది ఆగస్టులో నీలగిరి జిల్లాలో జరిగింది. 

పర్వీన్ నిన్న ఈ వీడియోను పోస్టు చేయగా ఇప్పటి వరకు 1.39 లక్షల మందికిపైగా వీక్షించారు.  ‘‘ఎవరైనా మీ ఇంటిని ఇలా సందర్శిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నల్ల చిరుతలు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా?’’ అని కశ్వాన్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ భయాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.

బ్లాక్ పాంథర్ చాలా సిగ్గరి. మనుషులున్న చోట అది ఎలా తిరిగిందబ్బా? అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. చూడ్డానికి భయంగా ఉన్నా అందంగా ఉంది అని మరో యూజర్ స్పందించాడు. బ్లాక్ పాంథర్‌ను ఒకసారైనా చూడాలని ఎంతోమంది తమ జీవితాంతం అడవుల్లో గడుపుతూ ఉంటారు. కానీ వీరు లక్కీ. ఇది చాలా సాధారణంగా ఇలా ఇంటిముందు చక్కర్లు కొట్టింది అని మరొకరు కామెంట్ చేశారు. ఇంత చక్కని వీడియోను షేర్ చేశారంటూ మరికొందరు పర్వీన్‌కు థ్యాంక్స్ చెప్పారు.
Black Panther
Parveen Kaswan
IFS
Tamil Nadu
Viral Videos

More Telugu News