Ravichandran Ashwin: చారిత్రాత్మక 500వ టెస్టు వికెట్‌‌ను ఎవరికి అంకితమిస్తున్నాడో ప్రకటించిన స్పిన్నర్ అశ్విన్

Ravichandran Ashwin dedicates 500th Test wicket to his father
  • తండ్రికి అంకితం ఇస్తున్నానని ప్రకటించిన అశ్విన్
  • సుదీర్ఘ జర్నీలో నాన్న తోడుగా ఉన్నాడని గుర్తుచేసుకున్న దిగ్గజ స్పిన్నర్
  • ప్రస్తుత మ్యాచ్ 5వ రోజున బ్యాటింగ్ సంక్లిష్టంగా మారుతుందని అంచనా వేసిన అశ్విన్
రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు టీమిండియా  స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 500వ వికెట్ తీసి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ‘‘చారిత్రాత్మకమైన ఈ వికెట్‌ను మా నాన్నకు అంకితం చేస్తున్నాను’’ అని అశ్విన్ తెలిపాడు. సుదీర్ఘమైన జర్నీలో మంచిచెడుల్లో నాన్న తన వెంటే ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. ‘‘నా ఆటను చూసిన ప్రతిసారీ నాన్న గుండెపోటుకు గురయ్యారు. టీవీలో నిరంతరం నా ఆట చూస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఆయన నాకు ఎల్లప్పుడు సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు 500వ వికెట్ కూడా పూర్తయ్యింది’’ అని అశ్విన్ అన్నాడు. రెండవ రోజు ఆట ముగింపు తర్వాత ఈ మేరకు అశ్విన్ మాట్లాడాడు.

"ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇంగ్లండ్ టీమ్ స్పష్టమైన ఉద్దేశ్యాన్ని ప్రదర్శిస్తోంది. చక్కటి బంతులు సంధించి వికెట్ ఆశించాలి.  ఈ పిచ్‌పై 5వ రోజున బ్యాటింగ్ చేయడం చాలా కఠినంగా మారుతుందని నేను భావిస్తున్నాను.  మ్యాచ్‌లో ప్రస్తుతం ఇరుజట్లు సమంగా ఉన్నాయి. అయితే శనివారం ఉదయం మాకు(ఇండియా) అనుకూలంగా మారొచ్చు. మేమే ఆధిపత్యం చెలాయించబోతున్నాం. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. మా ప్రతిస్పందన చాలా ముఖ్యం’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

కాగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ 500వ టెస్టు వికెట్‌ను సాధించి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ పేసర్ క్రాలేని అవుట్ చేసి ఈ ఘనత సాధించాడు. అనిల్ కుంబ్లే, షేన్ వార్న్ వంటి దిగ్గజ స్పిన్నర్లను అధిగమించి అత్యంత వేగంగా 500 టెస్ట్ వికెట్లు సాధించిన రెండవ ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే వేగంగా ముత్తయ్య మురళీధరన్ 500 వికెట్లు తీశాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ బ్యాటింగ్‌లోనూ అశ్విన్ రాణించాడు. కీలకమైన 37 పరుగులను జోడించిన విషయం తెలిసిందే.
Ravichandran Ashwin
500th Test wicket
Cricket
India vs England
Team India

More Telugu News