Naushad Khan: ఆ బ్యాటర్ చెప్పకుంటే సర్ఫరాజ్ తండ్రి స్టేడియానికి వచ్చేవాడే కాదట!

The Suryakumar Message That Convinced Sarfarazs Dad Naushad To Attend Sons Debut
  • నిన్న రాజ్‌కోట్ టెస్టుతో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ఖాన్
  • తాను వెళ్లి సర్ఫరాజ్‌పై ఒత్తిడి పెంచాలని అనుకోలేదన్న నౌషద్‌ఖాన్
  • తప్పకుండా వెళ్లాలని మోటివేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్
  • మళ్లీమళ్లీ ఇలాంటి క్షణాలు రావంటూ మెసేజ్
  • మెసేజ్ చూశాక ఆగలేక రాజ్‌కోట్‌కు పయనమయ్యానన్న నౌషద్
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్‌ఖాన్ నిన్న రాజ్‌కోట్‌ టెస్టుతో భారత జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే అతడికి టెస్ట్ క్యాప్ అందిస్తున్న సమయంలో ఆనందం పట్టలేక సర్ఫరాజ్ తండ్రి నౌషద్‌ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారుడిని కౌగిలించుకుని క్యాప్‌కు ముద్దుపెట్టారు. సర్ఫరాజ్ భార్య కూడా కన్నీరు పెట్టుకుంది. ఇక, సర్ఫరాజ్ కూడా కన్నీటిని అదిమిపెట్టుకున్నాడు. ఈ ఘటనతో స్టేడియంలో కూడా ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన సర్ఫరాజ్ 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

ఇదిలావుంచితే, సర్ఫరాజ్ తండ్రి నిజానికి కుమారుడి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావాలని అనుకోలేదట. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెప్పడంతోనే ఆయన వచ్చారట. ఈ విషయాన్ని నౌషద్ స్వయంగా వెల్లడించారు. సూర్యకుమార్ చెప్పడం వల్లే తాను రాజ్‌కోట్ వచ్చినట్టు చెప్పారు. 

‘‘నిజానికి నేను మ్యాచ్ చూసేందుకు రావాలని అనుకోలేదు. నేనొస్తే అది సర్ఫరాజ్‌పై ఒత్తిడికి కారణమవుతుంది. దీనికి తోడు నాకు కొంత జలుబుగా కూడా ఉండడంతో రాజ్‌కోట్ వెళ్లాలని అనుకోలేదు. అయితే సూర్యకుమార్ మెసేజ్‌కు కరిగిపోయి రాజ్‌కోట్ కు పయనమయ్యా’’ అని నౌషద్ చెప్పుకొచ్చారు.

సూర్య చేసిన మెసేజ్ ఏంటో కూడా ఆయన చదివి వినిపించారు. ‘‘నేను మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలను. నమ్మండి. గతేడాది మార్చిలో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాను. అప్పుడు టెస్టు క్యాప్ అందుకుంటున్నప్పుడు నా తల్లిదండ్రులు నా వెనకే ఉన్నారు’’ అని సూర్య ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్టు నౌషద్ తెలిపారు. ఆ క్షణాలు ప్రత్యేకమైనవని, ఇలాంటివి మళ్లీమళ్లీ రావని, కాబట్టి మీరు వెళ్లాలనే తాను కోరుకుంటున్నట్టు సూర్య మెసేజ్ చేయడంతో తానిక ఆగలేకపోయానని, రాజ్‌కోట్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు నౌషద్ తెలిపారు.
Naushad Khan
Sarfaraj Khan
Team India
Rajkot Test
Suryakumar Yadav

More Telugu News