Tirupati Sri Venkateshwara Zoological park: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

Tourist visiting Tirupati sri venkateshwara zoological park died in lion attack
  • తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం ఘటన
  • ప్రమాద హెచ్చరికలు లెక్కచేయక సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన రాజస్థాన్ వ్యక్తి
  • సింహం అతడి మెడ కొరకడంతో దుర్మరణం
  • మద్యం మత్తులోనే అతడు సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి ఉండొచ్చన్న అధికారులు
ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సింహం అతడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో గురువారం ఈ దారుణం వెలుగుచూసింది. 

పోలీసులు, జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ గురువారం మధ్యాహ్నం జూకు వచ్చాడు. ఆ తరువాత తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి సింహం ఎన్‌క్లోజర్‌ వద్దకు వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ మీదుగా ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. ఈ క్రమంలో అక్కడున్న సింహం అతడి మెడపట్టి కొరికి చంపేసింది. జంతు సంరక్షకుడు ఇది గమనించి సాయంగా వచ్చే లోపే దారుణం జరిగిపోయిందని అధికారులు చెప్పారు. 

అయితే, గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి ఆధార్ కార్డు వివరాలతో కుటుంబసభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటనకు గల కారణాలు వెలికి తీసేందుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.
Tirupati Sri Venkateshwara Zoological park
Tirupati
Lion Attack
Andhra Pradesh

More Telugu News