Jagan: రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే.. నా సైన్యం 2.60 లక్షల మంది వాలంటీర్లే: జగన్

Volunteers are my army and future leaders says Jagan
  • మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అన్న జగన్
  • యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ప్రశ్నించిన సీఎం
  • బాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని సూచన
రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యం అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లు అని కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే... మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పేదలకు సేవ చేయడానికే మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని జగన్ చెప్పారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులకు వాలంటీర్ల వ్యవస్థ తోడుగా ఉందని చెప్పారు.. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారని కొనియాడారు. 55 నెలలు పేదలకు సేవ చేశామని... పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. 

చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. బాబు మాటలను నమ్మితే నిండా మునిగి పోతారని ప్రతి రైతుకు చెప్పాలని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే... ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంట్లోకి తెచ్చుకోవడమే అని చెప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఇటువైపు తానొక్కడినే ఉన్నానని... అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, వారికి అనుకూలంగా ఉన్న టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వారికి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న ఓ జాతీయ పార్టీ, పరోక్షంగా మద్దతిస్తున్న మరో జాతీయ పార్టీ ఉన్నాయని చెప్పారు. తనకు అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వాలంటీర్లు ఉన్నారని తెలిపారు.
Jagan
YSRCP
Volunteers
Chandrababu
Telugudesam
AP Politics

More Telugu News