palla rajeswar reddy: చంద్రబాబు అండ్ కో చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Palla Rajeswar Reddy hot comments on Revanth Reddy
  • రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని తెలంగాణ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నమని ఆరోపణ
  • తెలంగాణ అస్థిత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • మాట్లాడుతుంటేనే మైక్ కట్ చేశారని మండిపాటు
  • కాకతీయుల రాజముద్రను తొలగించడం ఓరుగల్లు ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్య
చంద్రబాబు అండ్ కో చెప్పినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని తెలంగాణ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమైక్యాంధ్రభావ వారసుడు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ... 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకు 30 నిమిషాలు, ఒక సభ్యుడు ఉన్న సీపీఐకి ఒక గంట అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు.

బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.6 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు తాము నిలదీస్తామన్నారు. ప్రజల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కంచెలు ఎక్కడ వేశారో... ఎక్కడ తీశారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తాము మాట్లాడుతుంటేనే మైక్ కట్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాము మాట్లాడుతుంటే పదిమంది మంత్రులు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందలు, మోసాలు, అవాస్తవాలతో శ్వేతపత్రాలు... కాంగ్రెస్ తీరు అని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ అని వ్యాఖ్యానించారు. ఓరుగల్లు ప్రజలను అవమానపరిచేలా కాకతీయుల రాజముద్రను తొలగిస్తామని... సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ విగ్రహాన్ని పెడతామని కాంగ్రెస్ చెబుతోందని... ఇది ఆ పార్టీ భావదారిద్రానికి నిదర్శనమన్నారు. ఒక్కసారి కాకతీయుల పాలన గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. కాకతీయుల రాజముద్రను తొలగించడం కూడా చంద్రబాబు ఆదేశాలతోనే జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించారన్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ సభ్యులు మాపై అసభ్య పదజాలం వాడారని మండిపడ్డారు. సీఎం కాంగ్రెస్ సభ్యులను రెచ్చగొడుతున్నారన్నారు.
palla rajeswar reddy
BRS
Revanth Reddy

More Telugu News