Indian American: అమెరికాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ-అమెరికన్ దంపతులు, వారి కవల పిల్లల మృతి

Indian American couple and their twins found dead in California
  • మర్డర్ - సూసైడ్‌గా పోలీసుల అనుమానాలు
  • బెడ్‌రూమ్‌లో పిల్లల మృతదేహాలు.. బాత్‌రూమ్‌లో దంపతుల డెడ్‌బాడీస్ గుర్తింపు
  • కుటుంబ సభ్యుల సమాచారం మేరకు తనిఖీకి వెళ్లిన పోలీసులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. భారతీయ-అమెరికన్ దంపతులు, వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సంక్షేమ తనిఖీ నిమిత్తం వెళ్లిన వారికి ఆ బ్లాక్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ విషయాన్ని శాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంటి తలుపులన్నీ మూసి ఉన్నాయని, లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించి ఓ కిటికీ గుండా లోపలికి వెళ్లగా నలుగురి మృతదేహాలు కనిపించాయని పోలీసులు వివరించారు. మృతులు కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతడి భార్య అలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలు నోహ్, నీతాన్‌గా గుర్తించామని వివరించారు. 

హత్య-ఆత్మహత్య కేసుగా అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇద్దరు తుపాకీ గాయాలతో మృతి చెందారని, మరో ఇద్దరి మృతికి కారణాలు తెలియరాలేదని పోలీసులు వివరించారు. ఇంటి చుట్టుపక్కల పరిశీలించగా ఎవరూ లోపలికి వెళ్లినట్టుగా ఆనవాళ్లు దొరకలేదని, అందుకే హత్య-ఆత్మహత్యగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లల మృతదేహాలు బెడ్‌రూమ్‌లో కనిపించాయని, వీరిద్దరు ఏవిధంగా ప్రాణాలు కోల్పోయారన్నది నిర్ధారణ కాలేదన్నారు. బాత్‌రూమ్‌లో తుపాకీ గాయాలతో దంపతుల మృతదేహాలను గుర్తించామని చెప్పారు. 9ఎంఎం పిస్టల్, లోడ్ చేసిన ఒక మ్యాగజైన్‌ను కూడా గుర్తించామని చెప్పారు.

హత్య-ఆత్మహత్యకు కారణం ఏంటనేది తెలియరాలేదని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నామని తెలిపారు. ఈ ఘటన ఇంట్లోనే జరిగిందని, బయట వ్యక్తులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని, బాధ్యుడు ఇంట్లోని వ్యక్తిగా భావిస్తున్నామని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని, చుట్టుపక్కల వ్యక్తులు, కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.  
Indian American
Family died
California
USA

More Telugu News